Why should a baby get the father’s last name

తండ్రి ఇంటి పేరే ఎందుకుండాలి?

Why should a baby get the father’s last name

కౌసల్య నందన
యశోద తనయ
గౌతమీ పుత్ర శాతకర్ణి….
ఈ విధంగా మాతృస్వామ్య కాలంలో కొడుకులను తల్లిపేరుతోనో, తల్లి ఇంటి

పేరుతోనో కలిపి పిలిచేవారు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి పరిణమించే

కాలాన స్త్రీల అస్తిత్వం హరించబడింది. పితృస్వామ్య సమాజం పిల్లలని తండ్రి ఆస్తిలా

చూస్తుంది. కనుకనే పిల్లల ఇంటిపేర్లు తండ్రి ఇంటి పేర్లతో కొనసాగుతూ వచ్చాయి.

సకల రంగాల్లో మహిళలు తమ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని చాటుతున్నప్పటికీ

మగవాడి ఇంటిపేర్లు మాత్రమే పిల్లల మీద రుద్దబడుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని

ఇవాళ మహిళలు ప్రశ్నిస్తున్నారు. తండ్రి ఇంటి పేరే పిల్లలకు ఎందుకు ఉండాలని

అడుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన కొన్ని పార్శ్యాల విశ్లేషణ ఈ వ్యాసం.

మూడేళ్ళ క్రితం పెళ్ళయిన శాంతి తన ఇంటిపేరును మార్చుకోలేదు. అసలు దాని

గురించే ఆలోచించలేదు. తను గర్భవతి అయిన తర్వాత అసలు సమస్యలు

మొదలయ్యాయి. డెలివరీ సమయంలో ప్రభుత్వ రికార్డుల్లో రాయించేటప్పుడు తన

ఇంటిపేరుతోనే రాయించింది. అప్పుడు భర్త ఇంటిపేరు కూడా అదే అనుకొని వాళ్ళు

రాసేస్తుంటే ఆపి, తన ఇంటిపేరు వేరే అని చెప్పింది. ప్రభుత్వ అధికారులు వేరే ఎలా

ఉంటుంది. నీ భర్త ఇంటిపేరే నీ ఇంటిపేరు అవ్వాలి కద అని వాదనకు దిగారు. కాని

తను ఒప్పుకోలేదు. ”నా విద్యార్హతల్లో కూడా నా ఇంటిపేరే ఉంది. కాబట్టి నాపేరు

నాదేనని” వాదనకు దిగి చివరకు తన ఇంటిపేరుతోనే రికార్డు చేయించింది”. ఇలాంటి

ఎన్నో సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ మహిళలు తమ

ఇంటిపేరును మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కాని, అసలు భర్త ఇంటిపేరే భార్య

ఇంటిపేరుగా తప్పనిసరిగా మార్చుకోవాలా? అనేది ప్రశ్న.
పెళ్ళి జరుగుతుంది అంటే అమ్మాయిలు తమ ఇంటిపేరును మార్చుకునే రోజు

వచ్చిందని అంటుంటారు. కాని నిజంగానే మహిళలు ఇంటిపేరును మార్చుకోవాలా?

ఆధునిక మహిళల సమస్యల్లో ముఖ్యమైన, ప్రాధాన్యత సంతరించుకున్న సమస్య ఇది.

సమాజంలో, ఉద్యోగాలలో ముఖ్యంగా ప్రైవేట్‌ ఉద్యోగాలలో, వివాహం తర్వాత

విదేశాలకు వెళ్ళే సమయంలో… ఇలా బయట సమాజంలో పేరు మార్పునకు

సంబంధించి మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చట్ట ప్రకారం…
”పెళ్ళయిన తర్వాత తమ ఇంటిపేరును మార్చుకునే విషయంలో మహిళలకు పూర్తి

స్వేచ్ఛ ఉందని” కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక మౌలికమైన తీర్పు ఇచ్చింది.

కొన్నిసార్లు భర్త ఇంటిపేరుతోనే డాక్యుమెంట్లు కావలసి వస్తుంది. అలాంటి పరిస్ధితుల్లో

లాయర్‌ అఫిడవిట్‌ తప్పనిసరి. కాని అన్నింటికి ఇలాంటివి అవసరం పడవు. కాని

జాయింట్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌, వీసా లాంటి సమయాల్లో లాయర్‌ అఫిడవిట్‌ తప్పనిసరని

సుప్రీంకోర్టు లాయర్‌ సుబ్రత ముఖర్జీ అంటున్నారు.
మహిళలు అన్నిరంగాల్లో ముందుంటున్నారు. కాని కొన్ని విషయాల్లో మాత్రం

సాంప్రదాయపద్దతులనే అనుసరిస్తున్నారు. ఇప్పుడు వివాహాన్ని కూడా

ప్రభుత్వకార్యాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేయించాలి. కాబట్టి అక్కడ మహిళల

ఇంటిపేరులో ఎలాంటి మార్పు ఉండదు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌లో కూడా అమ్మాయి

తండ్రి ఇంటిపేరే ఉంటుంది. కాబట్టి చట్టపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.
అప్పటివరకు తన ఇంటిపేరుతో ప్రాచుర్యం పొందిన మహిళలు వెంటనే ఇంటిపేరును

మార్చుకోవడం వలన తమ గుర్తింపును కోల్పోతారు. ఇంటి పేరు

మార్చుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకొంతమంది మహిళలు ఏం

వాదిస్తున్నారంటే – ”ఇంటిపేరు మార్చుకోకపోవడం అనేది వారివారి వ్యక్తిగత

విషయం. కాని అమ్మాయిలకు వస్తున్న ఇంటిపేరు కూడా ఒక పురుషుని (తండ్రి)

నుంచే వస్తుంది. ఎంతమంది తమ తల్లి ఇంటిపేరును పిల్లలకు పెడుతున్నారు” అన్న

మాటలు గమనార్హం.
తల్లి వారసత్వం…
ఇంకొక ఉపయుక్తమైన ఆలోచన, ప్రశ్న ఏమిటంటే… తల్లి వారసత్వంగా తల్లి

ఇంటిపేరునే చెలామణిలో ఉంచుకోవడం. ఇది అన్ని సందర్భాలలో ఉపయోగపడదనేది

వాదన. ఇందాకా చెప్పుకున్నట్లు వ్యక్తిగత గుర్తింపు ఎలాగూ మీ సొంత పేరుతోనే

ఉంటుంది. కాబట్టి ఇంటిపేరును మార్చుకోవడం కొన్ని సమస్యలకు దారితీస్తుంది.

వృత్తిపరంగా కూడా సమస్యలు వస్తాయి. ఇంటిపేరు మార్చుకోవడం వలన అన్ని

సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను కూడా మార్చుకోవలసి వస్తుంది. ఇది కష్టమైన పని

కూడా. బ్యాంకు ఎకౌంట్లు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు… ఇలా అన్నింటిని

మార్చుకోవాలి. అంతేకాదు, వ్యక్తిగతంగా, సంస్కృతిపరంగా ఇంటి చరిత్రను కూడా

పరిగణనలోనికి తీసుకొని కూడా ఇంటిపేరు మార్చుకోవడానికి నేటి మహిళలు

ఇష్టపడటం లేదు. అంతేకాదు, అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా

వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇంటిపేరుతో తమ గుర్తింపును కోల్పోవడం ఇష్టం లేదని

కూడా మహిళల ఆలోచనలు ఉన్నాయి.
భర్త నుంచి విడిపోయిన మహిళలు పిల్లలకు తమ ఇంటిపేరును పెట్టే స్వేచ్ఛను

పొందడంలేదు. ధైర్యంగా, ఆర్ధికంగా బలంగా ఉన్న మహిళలు మాత్రమే తమ

పిల్లలకు వారి ఇంటిపేరునే ఇస్తున్నారు. దాదాపు అన్ని సంస్ధలు అప్లికేషన్లలో తల్లి

పేరును పరిగణించడం లేదు. విడిపోయిక కూడా భర్త ఇంటిపేరు రుద్దబడుతుంది.
పనిచేసే మహిళలు…
ఆర్ధికంగా బలంగా ఉంటేనే ఏమయినా సాధించగలమని, వ్యక్తిగత గుర్తింపు కూడా

లభిస్తుందనేది నేటి ఆధునిక మహిళ ఆలోచన. అందుకే తమ ఇంటిపేరును

మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. అంతేగాక, ఎప్పటినుంచో గుర్తింపు పొందిన

మహిళలు కావచ్చు… వృత్తిలో ఉన్నతస్ధానాల్లో ఉన్నవారు కావచ్చు… పెళ్ళికన్నా

ముందే ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు… ఇలాంటి వారందరూ తమ గుర్తింపును

కోల్పోతామని ఇంటిపేరును మార్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. అసలు ఇంటిపేరుతో

కాక తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే ఎక్కువ గుర్తింపు పొందినవారు ఉన్నారు. వారు

కూడా ఇంటిపేరు సమస్యేకాదు. అసలు అది భర్తదైనా, తండ్రిదైనా వాటి అవసరం

లేదనేది కూడా వాదిస్తున్నారు.
పనిచేసే ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రైవేట్‌ కంపెనీలలో భర్త ఇంటిపేరును తప్పనిసరిగా

అడుగుతున్నారు. వాటిద్వారానే వారి గుర్తింపును ఇస్తున్నారు. పెళ్ళికాని వారికి మాత్రం

వారి సర్టిఫికెట్లను బట్టే ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు, విదేశాలలో పనిచేసే

మహిళలు భర్త నుంచి విడిపోయినా కూడా వారికి వీసాను ఇవ్వడానికి భర్త గుర్తింపు

తప్పనిసరని, వీసా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
మిశ్రమ పేర్లు…
కొంతమంది తండ్రి ఇంటిపేరు, భర్త పేరును కలిపి పెట్టుకుంటారు. ఉదాహరణకు

బెంగాలీ నటి కొంకణాసేన్‌ శర్మ. తను తన తల్లి ఇంటిపేరు సేన్‌ను, తండ్రి ఇంటిపేరు

శర్మను కలిపి తనకు పెట్టుకుంది. అలాగే భార్యలు కూడా భర్త ఇంటిపేరుతో కలిపి తన

ఇంటిపేరును కూడా చిన్నవిగా చేసి కూడా పెట్టుకుంటున్నారు. దీని వలన ఇద్దరికి

ప్రాధాన్యం ఇచ్చామని అనుకుంటారు. ఇలా భర్త మాత్రం చేయడు. భర్త తన

ఇంటిపేరుతో కలిపి భార్య ఇంటిపేరును కూడా పెట్టుకుంటాడా? అంటే లేదు. ఇది

పురుష్యాధిక్య సమాజం. కాబట్టి భార్య భర్త ఇంటిపేరును తప్పనిసరిగా పెట్టుకోవాలనే

వాదన పెద్దలు చేస్తుంటారు.
కొంతమంది తమ పిల్లలకు ఇద్దరి ఇంటిపేర్లు కలిపి కూడా పెడుతుంటారు. ఈ

విషయంలో ముందు ఎవరిది పెట్టాలి అనే వాదన కూడా వస్తుంది. కాని ఇది

ఒకందుకు మంచిదే కద. మార్పుకు నాందిగా అనుకోవచ్చు. కాని ఇంటిపేరు

లేకుండా ఉంటే… గుర్తింపుకు ఏమయినా సమస్య వస్తుందా?
పిల్లల వైపు నుంచి…
భార్య తన ఇంటిపేరునైతే మార్చుకోదు కాని పిల్లలకు మాత్రం ఏవరిది పెడతారు?

అనేది ప్రశ్న. సాధారణంగా తండ్రి ఇంటిపేరునే పిల్లలకు పెడతారు. భార్యగా తన పేరు

మార్చుకోకపోయినా పిల్లల విషయంలో మాత్రం తను ఏం మాట్లాడదు. ఇది మన

సమాజంలో స్త్రీల పరిస్ధితి. పిల్లలు కూడా తల్లి, తండ్రి ఇంటిపేర్లలో వ్యత్యాసాలను

గమనించి వేరువేరుగా ఉన్నాయో అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి… అనేది

తల్లి అందోళన. ”మా అమ్మాయిని నీ ఇంటిపేరు ఏమిటి అంటే మా అమ్మ ఇంటిపేరే

నా ఇంటిపేరు” అంటుంది అని స్రవంతి ఎంతో గర్వంగా చెబుతుంది. అవును ఇలా

ఎంతమంది పిల్లలు చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పుడు స్కూలు నుంచి

విశ్వవిద్యాలయాల వరకు అన్ని అప్టికేషన్లలో తల్లి పేరును కూడా చేర్చారు. కాని తల్లి

పేరు దగ్గర ఇంటిపేరు ఉండదు. ఇది ఎంతవరకు సబబు. ఇది అన్‌లైన్‌లో అయితే

రాయలేం. కాని రాతపూర్వక పత్రాల్లో రాస్తే అదేమిటి అని అంటారు స్కూల్‌ వాళ్ళు.

ఇది మన సమాజం తీరు. మహిళలు మారుతున్నారని ఒక పక్క చెప్పుకుంటున్నా….

ఇంకొక పక్క వారు తండ్రికి, భర్త ఇంటిపేరుకు ఇస్తున్న ప్రాముఖ్యత కూడా ఆందోళన

కలిగించే విషయమే. ఆస్తిహక్కుతో పాటు ‘గుర్తింపుకోసం’ జరిగే ఇలాంటి సంస్కరణల

ఉద్యమాలకూ ప్రాధాన్యత పెరుగుతుంది.
మారుతున్న కాలంతో పాటే కుటుంబ సంబంధాలు, అందులో భాగంగా భార్యాభర్తల

సంబంధాలు కూడా మారుతుంటాయి. ప్రస్తుతం మహిళల్లో పెరుగుతున్న చైతన్యం

పురుషాధిక్య సమాజానికి కొత్త సవాళ్లను విసురుతోంది. ఇంటి పేరు మార్పు అనేది పైకి

సాదాసీదా సమస్యగా కనిపించినా అది పెరుగుతున్న సంఘర్షణలకు అద్దం

పడుతుంది. ఇప్పుడీ సమస్య ఒక పరివర్తనా దశలో ఉంది. కాలక్రమంలో దీనికొక

పరిష్కారం లభిస్తుంది. పిల్లలకు ఎవరో ఒకరి ఇంటి పేరు కాకుండా తల్లిదండ్రుల పేరే

ఇంటి పేరుగా మారే అవకాశాన్ని తోసిపుచ్చలేం. దీర్ఘకాలంలో సమాజం తనను తాను

ఇలా సర్దుబాటు చేసుకుంటుంది. రాబోయే తరాలకు కొత్త చిరునామా వస్తుంది.
ఇంటిపేరు మార్పు విషయంలో భార్యకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. మహిళ ఇంటిపేరు

గురించి ఆలోచించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయాలంటే చదువు

ఒక్కటే పరిష్కారం. చదువుకోవడం ద్వారా మహిళల ఆలోచనలో మార్పు వస్తుంది.

అప్పుడే తను పిల్లల విషయంలో కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతుందనేది

సత్యం. ఇది మంచి మార్పుకు దోహదం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *