Tips to stay young వృద్ధాప్యమా నో చింత – యవ్వన మాత్ర
లండన్, దక్కన్ న్యూస్ : వయస్సు అయిపోతుంది..బాధపడుతున్నారా ? జీవితమే వ్యర్థమని అనిపిస్తుందా ? అయితే ఇంక అలాంటి చింత పెట్టుకోకండి..త్వరలోనే ఓ ‘మందు’ వస్తోంది..ఎంటీ టి.వి.లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా ? కాదండి ఇది పచ్చి నిజం..యవ్వనాన్ని కాపాడేందుకు త్వరలోనే ఓ అమృతంలాంటి బిళ్ళ రాబోతుంది. ఈ గోళి వేసుకుంటే వయస్సుతో పాటు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుందంట. ఈ విషయాన్ని బ్రిటీష్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటికే వారు జంతువులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నట్లు లండన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు కూడా.
‘రమామైసిన్’ డ్రగ్‌ను ఎలుకల మీద ప్రయోగించడం జరిగిందని..ఇవి ఎక్కువ కాలం జీవిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. నరాల పటుత్వం కాపాడడంలో ఈ మందు ప్రముఖ పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు. వయస్సు పైబడిన కొద్ది వివిధ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. గుండెజబ్బులు, కేన్సర్, మతిమరపులాంటి రోగాలు వస్తాయి. వయస్సు పెరుగుదల వల్ల శరీరంలో కలిగే మార్పులపై దృష్టి సారించడం వల్ల వాటిని నియంత్రించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. రమామైసిన్తో ఈ విధానం చక్కగా అమలయ్యే సూచనలున్నాయని, రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ మందు రావాలంటే కొద్ది కాలం ఆగక తప్పదు..