Role of women in agricultureవ్యవ’సాయం`లో ఆమెదే అగ్రస్థానం
‘ఎక్కడమ్మా నీవు లేనిది.. ఏమిటి నువ్వు చేయలేనిది..’ అన్న కవి మాటలు
అక్షరసత్యాలు. వ్యవసాయంలో స్త్రీ భాగస్వామ్యం అత్యధికం. వ్యవసాయంలో
మహిళలు 33 శాతం మంది రైతులుగా పనిచేస్తుంటే, 47 శాతం మంది వ్యవసాయ
కూలీలు. అంటే మూడు వంతులకు పైనే మహిళలు వ్యవసాయంలో కీలకపాత్ర
పోషిస్తున్నారు. వ్యవసాయంలో స్త్రీ పాత్ర ఇంతగా ఉన్నా, వారి పట్ల వివక్ష చూపుతూ,
ప్రధాన భాగస్వాములుగా వారిని గుర్తించడం లేదు. ఈ అంశంపై ఎవరూ చర్చించరు.
నేడు అఖిలభారత వ్యవసాయ కార్మికసంఘం మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో
‘వ్యవసాయంలో స్త్రీ పాత్ర’ ఒకసారి గుర్తు చేసుకుందాం.
వ్యవసాయంలో మహిళలదే ప్రధానపాత్ర అనడంలో అతిశయోక్తే లేదు.
కలుపు తీయడం నుండి నాట్లు వేయడం, కుప్పనూర్చడంలో ముఖ్యమైన పాత్రను
మహిళలే పోషిస్తున్నారు. కల్లంలోనే కాకుండా ఇంటి వద్ద పంటను ప్రాసెసింగ్
చేయడంలో, విత్తనాల తయారీలో స్త్రీల పాత్రే అధికం. అయినా వ్యవసాయంలో స్త్రీలను
ప్రధాన భాగస్వాములుగా గుర్తించడం లేదు.
అనుబంధం..
వ్యవసాయం అంటే పదిరకాల పనులతో పెనవేసుకున్నది.
గొలుసుకట్టులా ఒక పనికి మరొకపనికి అనుసంధానమై ఉంటుంది. ఇందులో
మహిళల పాత్ర చాలా ఎక్కువ. భూమి సంబంధాలలో స్త్రీ పాత్రపై చర్చించాలి. భూమి
అనేది సామాజిక హోదాకి సంబంధించిన విషయం. 2005 సంవత్సరంలో వచ్చిన
చట్టం చాలా ముఖ్యమైంది. వ్యవసాయ భూములపై స్త్రీలకు వారసత్వ హక్కు
ఉంటుందని ఈ చట్టం చెబుతోంది. అయితే స్త్రీలకు ఆ హక్కు ఇవ్వడానికి సామాజిక
సంబంధాలు నేటికీ ఒప్పుకోవడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే ఆ స్త్రీని వెలివేసే
పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతోంది. ఒకరు అడిగితే మరో పదిమంది అడుగుతారనే
భావనను వ్యక్తం చేస్తూ, ఆ స్త్రీ నోరు మూస్తున్నారు.
ఆదాయ వనరు..
వ్యవసాయం ఆదాయవనరుగా స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
భూమి ఒక సామాజిక హోదాను ఇస్తుంది. భూమిపై మహిళలకు అధికారం
ఉండకపోవడమంటే వారికి జీవనాధారాన్ని నిరాకరించడమే. మన రాష్ట్రంలో ప్రత్యేక
ఆర్థిక మండళ్ల (సెజ్) ను పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. ‘మా
భూమి, మేము పనిచేసే చోటు, తిండి పెట్టేది, మా జీవనం, మా భద్రత’ అంటూ స్త్రీలే
నినదిస్తున్నారు. గ్రామీణ జీవితంలో ప్రధానంగా వ్యవసాయంలో స్త్రీల కృషి చాలా
ఎక్కువ.
శిక్షణా తరగతులు..
వ్యవసాయం నేడు సంక్షోభంలో ఉంది. యువరైఐతుకు పిల్లనిచ్చేందుకు
చాలామంది వెనకాడుతున్నారు. వ్యవసాయరంగానికి గౌరవం లేకుండా పోతోంది.
వ్యవసాయ పరిస్థితి ఇలా ఉన్నా కూడా నేడు కొన్ని కుటుంబాలు తమ పిల్లల్ని
వ్యవసాయం కోర్సులు చదివించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది గర్వించాల్సిన
విషయం. అందుకు కారణం మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కావడమే. అయితే
గట్టుపై నుండి చెప్పేది, క్లాసులో బోధించేది వ్యవసాయం కాదు. పొలాల్లో బురదలోకి
దిగి చేసేదే వ్యవసాయం. మనదేశంలో రైతులకన్నా వ్యవసాయకార్మికులకే ఎక్కువ
తెలుసు. వివిధ దేశాలలో వ్యవసాయం నేర్చుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి.
జపాన్లో ఏడాదికి ఒక్కసారైనా తమ తమ సొంత పొలాల్లో వ్యవసాయం చేసేందుకు
వెళుతుంటారు. మన దేశంలో ఆ పరిస్థితి చూద్దామన్నా కనిపించదు. అందుకే మన
దేశంలో కౌలురైతుల సంఖ్య ఎక్కువ. ఇవన్నీ పక్కనపెట్టి, నిత్యం పొలంలో ఉండే
మహిళలకు శిక్షణ ఇస్తే బంగారాన్ని పండించరూ! దేశ ఆహారభద్రతకు
మూలస్థంభమైన వ్యవసాయంపై మన ఏలికలు విధానపరమైన నిర్లక్ష్యం చేస్తున్నారు.
దీని ఫలితాన్ని త్వరలో చూడబోతున్నాం. దీనికి పరిష్కారం మాత్రం ఆహారభద్రత
చట్టం చేయడం కాదన్నది సుస్పష్టం.
ఎవరు ముఖ్యం?
వ్యవసాయంలో పురుషులు ముఖ్యమా, మహిళలు ముఖ్యమా అని
స్త్రీలను అడిగితే మగవారు ముఖ్యమని చెబుతారు. కానీ వ్యవసాయంలో స్త్రీలు లేకపోతే
కష్టమని పురుషులు ఒక్కసారి కూడా అనరు. తామే ప్రధానమని వాళ్ల భావం కూడా.
కానీ ఆచరణలో మహిళా భాగస్వామ్యం లేనిదే పంట చేతికి రాదన్నది వాస్తవం.
పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా కష్టపడుతున్నారని ఎన్నో
అధ్యయనాలు తేల్చాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో స్త్రీల కష్టమే అధికమని ఆ
అధ్యయనం తేల్చింది. భూమిని దున్నడం దగ్గర నుండి పంట పండించి, ఇంటికి చేర్చే
వరకూ, అవసరమైతే మార్కెట్కు సైతం.. ఇలా అన్ని పనుల్లో కష్టించేది మగువలేనట.
వ్యవసాయం పనులలో పురుషుల వాటాకన్నా మహిళల వాటాయే
ఎక్కువని, 80 శాతం పనిభారం వాళ్లదేననీ అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని
కొన్ని కోట్లమంది మహిళలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంలో కీలకమైన
పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు దీనికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమలో
అయితే మహిళల వాటా తొంభై శాతం. పురుషులు సగటున 1800 గంటలు
కష్టపడుతుంటే, స్త్రీలు 3,300 గంటలపాటు వ్యవసాయంలో కష్టపడుతున్నారని
కూడాఈ సర్వేలు చెబుతున్నాయి.
మార్పు రావాలి..
ప్రభుత్వ విధానాల్లో, సామాజిక దృష్టిలో మార్పులు రావాలి. అప్పుడే
వ్యవసాయంలో మహిళల పరిస్థితి అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యవసాయం
కలసిరాక, అప్పులపాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటే, వారి భార్యలు ఒంటరిగా
పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇలాంటి ఒంటరి మహిళలు వ్యవసాయంలో కొనసాగేలా
పాలకులు మద్దతివ్వాలి. మార్కెట్ సౌకర్యం కల్పించాలి. గ్రూపులుగా విభజించాలి.
రుణాలు, సబ్సిడీలు అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రధానంగా వ్యవసాయంలో
మహిళలకు సాంకేతికత కూడా అందుబాటులో ఉంచాలి.