Milestones in the life of Super Star Krishna

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశాడు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవాడు.

తాను బి.ఎ. చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. అతనికి ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.

కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచింది. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Updated: May 31, 2020 — 3:28 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *