Dry bath gel
మండే ఎండాకాలం పోయింది. మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడో వర్షం పడడంతో అక్కడి చల్లటి గాలులు బెడ్‌పైన పడుకున్న మన వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
చలి చలిగా ఉన్న ఈ టైంలో స్నానం చేయాలంటే ‘అబ్బా….’ అనిపిస్తోంది కదూ..! సరిగ్గా మీలాంటి వాళ్లకోసమే అంటే స్నానం చేయడానికి ససేమిరా అనేవాళ్ల కోసం కొత్గగా ఓ జెల్ పుట్టుకొచ్చింది. దానిని రాసుకుంటే సరి మీరిక స్నానం చేసినట్లే. ఎందుకంటే చర్మంపైనున్న క్రిములను చంపేయడంతోపాటు చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా ఘుమఘుమాలడిస్తుంది కూడా. ఇన్ని ప్రయోజనాలుండగా ఇక స్నానం దేనికి? దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థి ‘డ్రై బాత్’ పేరున్న ఈ జెల్‌ను రూపొందించాడు. ఇందుకుగాను ఇతనికి 2011 గ్లోబల్ స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా దక్కింది. ఈ జెల్‌ను షాంపూ సాచెట్ల రూపంలో మార్కెట్లోకి తెచ్చేందుకు హెడ్‌బాయ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ కూడా ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో పేదలకు ఓ రేటుకు, పెద్దలకు ఓ రేటుకు ఈ జెల్‌ను విక్రయించాలని కూడా ఆ కంపెనీ నిర్ణయించిందట.
నిజానికి స్నానం చేయడానికి బద్దకించి దీనిని తయారు చేయలేదు. దీనిని తయారు చేయాల్సిన అవరం ఎందుకొచ్చిందో తయారీదారుడు లుడ్విక్ మ్యారీషేన్ వివరిస్తూ… ‘మేముంటున్న ప్రాంతంలో తాగడానికే నీరు అందుబాటులో లేదు. ఇక స్నానం చేయాలంటే మురికి నీటితోనే చేయాలి. ఇలా మురికి నీటితో స్నానం చేస్తే చర్మంపై క్రిములు చనిపోవడానికి బదులు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఆ క్రిములను చంపేందుకు మరేదైనా మార్గముందా? అని ఆలోచించాను. అయితే ఏ క్రీమ్ రాసుకున్నా క్రిములు చనిపోతున్నాయి.
అదే సమయంలో చర్మంపై క్రిమ్ తాలూకు జిడ్డు మిగిలిపోతోంది. దీంతో మళ్లీ స్నానం తప్పనిసరైంది. దీంతో స్నానం చేయించే ఓ జెల్ ఉంటే బాగుంటుందనుకున్నా. పరిశోధించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించా. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘డ్రై బాత్ జెల్’ అని పేర్కొన్నాడు.