రెండు వలసలు Kandukoori Durga Prasad

www.nlginfo.com/2014/04/kandukoori-durga-prasad_2.htmlఉత్తరం పైన
 ఇంటి చిరునామా రాసినప్పుడల్లా
మెతుకును మోస్తున్న చీమకాళ్ళతో
అమ్మ గుండెపైన
అలికినట్లుంది!
…………
నగరవీధుల నక్షా గీసుకున్న ముఖమ్మీది…
అభద్రతను గిల్లుకొని
అద్రుశ్యమయ్యే పరిచయాల మధ్య
ఎక్కడో గతం చిట్లినప్పుడు
పక్షితో సహా వలసపోయే…
చెట్టు వేర్లకింద….
సంతకాలు లేని వీలునామాల్లా
మాఊరి వీధులు వెర్రిగా మూల్గుతాయి

సగం తగలబడ్డ నా పెదాల….
కలవరింతల కలలమీద…
తోకలు కుచ్చుకొని….పంజరాలెగురుతాయ్!
నీళ్లమీద దూకిన చేపలు…
చచ్చిమరీ తేలుతాయ్!!

‘వాంటెడ్ కాలమ్’లోకి…..
మోకాళ్ళమీద పాకుతుంటే…
కూలిన నమ్మకాల పైకప్పులోంచి
ఎవరి ఏడుపో తొంగిచూసి నవ్వుతుంది!

రాత్రుల నిండా వెన్నెలలు ఉరితీస్తూ
ఎవరి విశ్వాసాల వైపు
బీడు సముద్రాల మీద… ఇలా
కరువునై కొట్టుకుపోను!

వలస! జీవితాలదే కాదు…
మనం మన్నుకప్పేసొచ్చిన
మరణాలది కూడా…

బహుషా…
చిన్నప్పుడు చంపి పాతేసిన
తుమ్మిష్క రక్తమనుకుంటా
బుగ్గలమీదిప్పుడు…
బరువుగా నడిచేది.
                                – Sri Kandukoori Durga Prasad
                                – శ్రీ కందుకూరి దుర్గా ప్రసాద్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *